సిద్ధిపేట: ఇంటర్మీడియట్ లో ఫెయిలైన విద్యార్థులకు సిద్ధిపేట తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు మరోసారి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే దానికి ఆత్మహత్యే పరిష్కారం కాదని, ఎవరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని ఆయన ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరారు. 

సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తడ్కపల్లి అజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసుకుని సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ విషయం తెలుసుకున్న హరీష్ రావు గారు వెంటనే స్పందించారు. ఆసుపత్రి డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

అదే విధంగా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పకుండా రివాల్యువేషన్ ద్వారా  విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. 

పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యే పరిష్కారం కాదని, పరీక్షలో ఫెయిలైతే జీవితంలో ఫెయిలైనట్లు కాదని, ప్రాణాలు పోతే తిరిగిరావని అంటూ దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతో ఓఎస్డీ బాల్ రాజు సిద్దిపేట ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న అజయ్ ని పరామర్శించి , కుటుంబానికి భరోసానిచ్చారు.