నీటిపారుదల అధికారుల తీరుపై మంత్రి హరీశ్ ఫైర్ ఫాస్ట్ ట్రాక్ కింద దేవాదుల పూర్తి చేయాలని ఆదేశం
దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి పై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం నాడిక్కడ జల సౌధలో దేవాదుల పనులను మంత్రి సమీక్షించారు. ప్యాకేజీల వారీగా భూసేకరణ, ఇతర నిర్మాణ పనులను సమీక్షిస్తూ పదహారేళ్లగా ఈ ప్రాజెక్టు ఇంత నత్తనడకగా ఎందుకు సాగుతోందని మంత్రి ప్రశ్నించారు. వచ్చే ఖరీఫ్ కల్లా నర్సంపేట, ములుగు, భూపాలపల్లి పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికి సాగు నీరివ్వాలని సీఎం కెసిఆర్ పట్టుదలతో ఉన్నట్టు మంత్రి గుర్తుచేశారు. కానీ పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని సహించబోనని హెచ్చరించారు. కాంట్రాక్టు సంస్థలపై 60 సి కింద చర్యలు తీసుకుంటానని, అలసత్వ నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులపై వేటు వేయడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. దేవాదుల పనులపై తనకు ప్రతిరోజూ ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని కోరారు. రామప్ప, పాఖాల, లక్నవరం చెరువులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 123 జీవో ప్రకారం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. 2018 కల్లా దేవాదుల మూడవ దశ పూర్తి కావాలన్నారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి రిటైర్డు తహసీల్దార్లను ఔట్ సోర్శింగ్ కింద తీసుకోవాలని రెవిన్యూ అధికారులకు సూచించారు. కాంతానపల్లి బ్యారేజీ పురోగతిని కూడా సమీక్షించారు. సమీక్ష సమావేశంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ,ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగరరావు , జనగామ జిల్లా కలెెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
