సినీనటుడు, టీడీపీ నేత హరికృష్ణ ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రోడ్డు ప్రమాదాన్ని ఓ వ్యక్తి స్వయంగా తన కళ్లతో చూశారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

‘‘మేము ఐదుమంది కలిసి కారులో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాం. నేనే డ్రైవింగ్ చేస్తున్నా. 6 గంటల సమయంలో మేము 80 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాం. ఆ సమయంలో మాకు ఎదురుగా హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అదుపు తప్పి 14 అడుగుల మేర గాల్లో ఎగిరి మా వైపు దూసుకొచ్చింది. అది గమనించి నేను నా కారును ఎడమవైపు తిప్పాను. లేదంటే హరికృష్ణ కారు మా కారు మీద పడాల్సింది. నేను ఎడమవైపుకు రోడ్డు పక్కడ తిప్పడంతో మా కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడగలిగాం. మా కారులో కుడివైపు కూర్చున్న వ్యక్తికి, నాకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి. మేమే లేచి చూసే సరికి రోడ్డు మీద వెళ్తున్నవారు హరికృష్ణగారిని గుర్తించి రోడ్డు మీదకు తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.’’ అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.