పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  ఓ యువతి హత్య కలకలం రేపుతోంది. కొన్నాళ్ల క్రితం ఇదే ఏరియాలో జరిగిన స్నేక్‌గ్యాంగ్‌ లాంటి భయంకరమైన ఘటన మరువక ముందే సోమవారం ఉదయం మరో దారుణం వెలుగుచూసింది. 

గుర్తు తెలియని యువతిపై అత్యాచారం చేసి, అనంతరం తలపై బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్యచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి కమాన్‌ రోడ్డు ఆర్‌.ఆర్‌.మసాలా గేట్‌ ఎదురుగా వాదే ముస్తపా వెళ్లే రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో ఎల్‌.బి.నగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.విష్ణు వర్ధన్‌ రెడ్డిలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన యువతి 25– 30 ఏళ్ల మధ్య ఉంటుంది.

ఆమెపై సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్కడికి వచ్చిన డాగ్‌ స్క్వాడ్‌ యువతి మృతదేహం నుంచి కమాన్‌ రోడ్డు సమీపంలోని ఓ గది వరకు వెళ్లి ఆగిపోయింది. క్లూస్‌ టీం సిబ్బంది శాంపిల్స్‌ సేకరణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 

ఘటనా స్థలంలో యువతి చెప్పులు, బురఖాతో పాటు గుట్కా ప్యాకెట్లు, సిమెంట్‌ బండరాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి నిందితులు ఆటోలో వచ్చినట్లు ఆటో టైర్ల జాడలు ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలంలోని పరిసరాలలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.