పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పెళ్లి జరిగి రెండు రోజులైనా గడవక ముందే... వరుడు కన్నుమూశాడు. కరెంట్ షాక్ తో వరుడు, అతని తల్లిదండ్రులు,మేనత్త కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని ముక్తాపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన సాయిలు తన కుమారుడికి రేవణపల్లి గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 19వ తేదీన వివాహం జరిపించాడు. పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పెళ్లికుమార్తె ఇంట్లో శుభకార్యం ముగించుకొని తిరిగి ముక్తాపూర్‌  చేరుకున్నారు. పందిట్లో విద్యుత్తు బల్బులకు వేసిన తీగ ఇనుప స్తంభానికి తగిలించారు. 

అదే ఇనుప స్తంభానికి దుస్తులు ఆరేయడానికి తీగను కట్టారు. ప్రమాదవశాత్తు విద్యుత్తు స్తంభం నుంచి తీగకు విద్యుత్తు సరఫరా జరిగింది. పెళ్లికుమారుడి తల్లి అదే తీగపై దుస్తులు ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు విద్యుదాఘాతానికి గురయ్యారు. 

పెళ్లికుమారుడు చిందం ప్రవీణ్‌(22), పెళ్లికుమారుడి తల్లిదండ్రులు చిందం సాయిలు(55), గంగమ్మ(50), వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన పెళ్లికుమారుడి మేనత్త గంగమ్మ(48)లు అపస్మారకస్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో.. గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.