తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం స్పష్టంగా కనిపించడంతో మిగిలిన పార్టీలు సోదిలో కనిపించకుండా పోయాయి. దీంతో  చాలా మంది రాజకీయంగా వెనుకబడిపోవడంతో పొలిటిక్స్ నుంచే తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు దశాబ్ధాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన పలు పదవులు నిర్వహించారు.

2014 ఎన్నికల తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో... అప్పట్లో పార్టీ నగరాధ్యక్షుడిగా ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గులాబీ కండువా కప్పుకున్నారు.

దీంతో నగరపార్టీ అధ్యక్ష బాధ్యతలను టీడీపీ అధినేత చంద్రబాబు...నాగేశ్వరరావుకు అప్పగించారు. నాటి నుంచి హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి టికెట్ ఆశించిన ఎమ్మెన్‌కు నిరాశే ఎదురైంది.

అయితే ఆ సీటును మహాకూటమి తరపున కాంగ్రెస్‌కు కేటాయించడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. భవిష్యత్తులో మంచి పదవి దక్కుతుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో మహాకూటమి తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి నాగేశ్వరరావు మద్ధతు ప్రకటించారు.

డిసెంబర్ 11న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి నిరాశాజనకమైన ఫలితాలు రావడం... నగరంలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నాగేశ్వరరావు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయన అనుచరులతో చర్చిస్తున్నారు.. అయితే అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తారా..? లేదంటే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారా అన్నది తెలియాల్సి వుంది.