తెలంగాణలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూతపడనున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో గతకొన్ని రోజులుగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో(శుక్రవారంతో) తెరపడనుంది. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ్టి నుండి మద్యం అమ్మకాలను నిలిచిపోనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రదాని కూతురు సురభి వాణిదేవి, బిజెపి సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రారావు, కాంగ్రెస్ తరపున చిన్నారెడ్డితో పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో నిలిచారు. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. ఈ స్థానంలో కాంగ్రెస్ తరపున రాములు నాయక్, బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నెల 14వ తేదీ అంటే ఆదివారం పోలింగ్ జరగనుంది.

read more గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయం కోసం కేసీఆర్ పక్కా ప్లాన్, విపక్షాలకు చెక్

ఈ రెండు స్థానాల్లో గతకొన్ని రోజులుగా అన్ని పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఈరోజుతో ఈ ప్రచారానికి తెరపడనుంది. ఓటర్లను మభ్యపెట్టకుండా, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఎన్నికలు జరిగే జిల్లాల్లో మద్యం అమ్మకాలను నిలిపివేస్తోంది ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం 4గంటల నుండి నిలిచిపోయే మద్యం అమ్మకాలు మార్చి 14న పోలింగ్ ముగిసిన తర్వాతే తెరుచుకుంటాయి. అంతేకాదు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న ఈనెల 17న కూడా వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.