తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లేఖ రాశారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ ఈ లేఖ రాశారు. రాజ్‌భవన్‌కు వచ్చి ఈ బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి గవర్నర్ తమిళిసై సూచించారు. 

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లేఖ రాశారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ ఈ లేఖ రాశారు. రాజ్‌భవన్‌కు వచ్చి ఈ బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అని ప్రశ్నించారు. అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే విధంగా యూజీసీ కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. యూనివర్సిటీల్లో ఖాళీలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం చెల్లుబాటు అవుతుందా ? కాదా ? అనే దానిపై ఆమె యూజీసీ అభిప్రాయం కోరారు. 

ఇక, మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా ఖాళీలను రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.

ఇక, రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లును తెలంగాణ సర్కార్ తీసుకొచ్చింది. బోర్డుకు ఒక చైర్‌పర్సన్‌, నలుగురు సభ్యులు ఉంటారని తెలిపింది. పదవిరీత్యా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సైతం చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహత్మాగాంధీ, తెలంగాణ, తెలంగాణ మహిళా వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్‌, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ యూనివర్సిటీలు బోర్డు పరిధిలో చేర్చింది. 

అయితే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు కూడా గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును పెండింగ్‌లో ఉంచడం ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేశారని తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది.పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు ఆమోదం తెలపాలని గవర్నర్‌ను కోరింది. లేకుంటే బుధవారం వేలాది మంది విద్యార్థులతో రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించింది. 

ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఢిల్లీ పర్యటనలో గవర్నర్ తమిళిసై నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే ఈ పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరింత దూరం పెంచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.