హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు నూతన గవర్నర్ తమిళ ఇసై సౌందరరాజన్. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అంటూ కితాబిచ్చారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సౌందరరాజన్ ప్రసంగించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోబోతుందంటూ స్పష్టం చేశారు. 

బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిపోతుందని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తమిళ ఇసై అన్నారు. 

తెలంగాణ 14.84 శాతం అభివృద్ధి రేటు సాధించిందని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని ప్రశంసించారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. తెలంగాణలో అందరి పండుగలకు సమాన గౌరవం ఉంటుందని చెప్పుకొచ్చారు.

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధులాంటి అద్భుత పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గవర్నర్ అభినందించారు. 30 రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమం అంటూ కితాబిచ్చారు. పాలమూరు- రంగారెడ్డి పథకంతో కృష్ణా జలాలు గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. 

ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్‌ రికార్డ్‌ సృష్టిస్తోందన్నారు. సేవల రంగంలో అద్భుత పురోగతితో హైదరాబాద్‌ ముందంజలో ఉందన్నారు. దేశంలోని మిగతారంగాలకు మార్గదర్శకంగా హైదరాబాద్ నిలుస్తోందని తమిళ ఇసై సౌందరరాజన్ తెలిపారు.