తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్  ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఈ విషయం కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రుజువయ్యిందన్నారు. బలమైన నాయకుడిగా పేరుతెచ్చుకున్న కేసీఆర్ వల్లే రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే మరోసారి కోరుకున్నారని...ఆయన నేతృతవంలోని ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటుకున్నారని గవర్నర్ వెల్లడించారు. 

ఇవాళ 70వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా బళగాలు, పోలీసుల నుండి  గౌరవ వందనాన్ని స్వీకరించారు.  అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

గత నాలుగున్నరేళ్లుగా నూతన రాష్ట్రం  తెలంగాణ చాలా అభివృద్ది చెందిందని గవర్నర్ ప్రశంసించారు. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పునర్మించారని ప్రశంసించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని  ముందుడి నడుపుతూ గొప్ప నాయకుడిగా ఎదిగారని  ప్రశంసించారు. ఇలా ఆయన నేతృత్వంలో రాష్ట్రం బాలారిష్టాలను దాటుకుని   అభివృద్దిలో దూసుకుపోతోందని గవర్నర్ వెల్లడించారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో కేవలం ప్రజా సంక్షేమ పథకాల కోసమే ప్రభుత్వం సంవత్సరానికి రూ.40 వేల  కోట్లను వెచ్చిస్తుందన్నారు.  వేరే ఏ రాష్ట్రం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇంత భారీగా ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదని గుర్తుచేశారు. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్దాప్య పించన్ల అర్హుల వయసును 57 ఏళ్లకు తగ్గించి...పెన్షన్ డబ్బులు కూడా డబుల్ చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. అలాగే వితంతు, దివ్యాంగుల పెన్షన్లను కూడా పెంచనున్నట్లు తెలిపారు. 

నీటి కేటాయింపులపై ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు తొలగించినట్లు పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టులకు కేంద్రం, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్ మెంట్ ల నుండి అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. ఇక కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్ట్  ను ప్రభుత్వం చిత్తశుద్దితో త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తోందన్నారు. 

మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి వనరులైన వేల చెరువుల పునరుద్దరణ చేపట్టినట్లు వెల్లడించారు. వాటిలోని పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆ మట్టిని రైతులకు ఉచితంగా అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇత తాగు నీటి కోసం మిషన్ భగీరథ వంటి బృహత్తర పథకాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు.  వచ్చే మార్చి వరకు మొత్తం నల్లాలు పూర్తి చేసి ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు గవర్నర్ హామీ  ఇచ్చారు. 

వ్యవసాయానికి 24 గంటల నిరంత ఉచిత విద్యుత్  అందిస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే రైతు బంధు, రైతు భీమా పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయన్నారు. 

యాదవులకు గొర్రెలు, మత్స్యకారులు, ముదిరాజ్ కులాలకు చేపల పంపిణీతో పాటు నాయి బ్రాహ్మణులు, రజక  కులాలకు కూడా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఆయా  కులాల  వారిగా కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆదాయ వనరులు పెరిగే ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.