త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలు ప్రారంభమవుతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో మాంసం వినియోగ దారులకు నాణ్యమైన మాంసాన్ని అందించేందుకే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన హైదరాబాద్ లో అన్నారు. 

శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యుల కొత్త సంవత్సర డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీతి, శ్వేత, పింక్ విప్లవాలతో తెలంగాణ పశుసంవర్ధక శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో అపారమైన పశు సంపద సృష్టించబడిందని మంత్రి తెలిపారు. మూగ జీవాలకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశు వైద్య శాలలను కూడా ప్రారంభించిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

దేశంలోనే కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో తెలంగాణ పశుసంవర్ధక శాఖను ప్రశంసించిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.