గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల కోసం అధికారిక టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కనుందనే విషయంపై ఇప్పటికే పలుమార్లు పలువురి పేర్లు వినపడగా.. తాజాగా వారి పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి కట్టపెట్టాలనే విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

మూడు ఖాళీలు ఉండటంతో ఒకటి ఓసీకి, మరొకటి బీసీకి... ఇంకొకటి ఎస్సీ లేదా ఎస్టీకి ఇవ్వాలని కేసీఆర్‌ అనుకుంటున్నారట. అయితే గతంలోలాగ అచ్చం అందరినీ రాజకీయ నేతలతో నింపేయకుండా గవర్నర్‌ కోటాకు అర్ధం.. పరమార్థం వచ్చేలా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే  వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారట. అందుకే కవులు, కళాకారులు ఈ కేటగిరిలో ఛాన్స్‌ దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. 

పరిశీలనలో కవి గోరెటి వెంకన్న, దయానంద్, మాజీమంత్రి బస్వరాజు సారయ్య పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దేశపతి శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ పదవి కోసం బాగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈసారికి మాత్రం ఆయనను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.

పల్లె కన్నీరు పెడుతుందో అని తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి... గాయకుడు గోరటి వెంకన్న పేరు ఖరారు చేసినట్లు ఎక్కువగా వినపడుతోంది.  తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుతూ బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒకపదవి ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ పదవి మాత్రం దక్కలేదు. అయితే ఈసారి మాత్రం పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. కాగా.. రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.