హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజాకవి గోరేటి వెంకన్న. ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ పరిపాన చూస్తుంటే మనసు పులకరిస్తోందని అభిప్రాయపడ్డారు. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చేందుకు చేస్తున్న చర్యలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాల అమలుకు జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరికొత్త విధానాలను ఆచరణలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సాక్షిగా తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని చెప్పడం సంచలన నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. 

గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తాజాగా జగన్ తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు చేసినట్లుగా కాకుండా కుళ్లు పద్ధతిలకు పోకుండా పాతకాలపు పద్దతిని సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారని తెలిపారు. 

నీతినిజాయితీతో కూడిన మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు. మరోవైపు జగన్ కేబినెట్ అద్భుతమంటూ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా దళితులకు హోంమంత్రి గానీ, ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత లేదన్నారు. 

దళితులు, బీసీలు, ఎస్టీలకు వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం సామాన్య విషయం కాదన్నారు. సామాజిక న్యాయం అంటే ఇదేనని తెలిపారు. అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం గెలిచినా వారికి కేవలం నాలుగు మంత్రి పదవులే ఇచ్చి ఎస్సీఎస్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. 

ఇకపోతే ఆశావర్కర్లకు జీతాలు పెంపు, ఆర్టీసీ విలీనం దిశగా జగన్ చేస్తున్నది మంచి పరిణామం అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తానని జగన్ చేసిన ప్రకటన శుభకరమన్నారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తాననని జగన్ ప్రకటించడం చూస్తుంటే మరింత మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారని గోరేటి వెంకన్న తెలిపారు.