Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. దసరాకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే బహుమతులు గెలుచుకునే చాన్స్..

దసరా పండగ వేళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించే వారికి టీఎస్‌ఆర్టీసీ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన మాదిరిగానే దసరాకు కూడా లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలని నిర్ణయించింది.

Good news for passengers TSRTC Announces Lucky Draw Contest during dasara season ksm
Author
First Published Oct 10, 2023, 4:16 PM IST | Last Updated Oct 10, 2023, 4:16 PM IST

దసరా పండగ వేళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించే వారికి టీఎస్‌ఆర్టీసీ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన మాదిరిగానే దసరాకు కూడా లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలని నిర్ణయించింది. దసరా పండగ వేళ తమ సంస్థ బస్సుల్లో ప్రయాణించే వారిని ఈ అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ. 11 లక్షల నగదు బ‌హుమ‌తులు అందించనున్నట్టుగా తెలిపింది. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ. 9,900 చొప్పున బహుమతులను ఇవ్వనన్నట్టుగా పేర్కొంది. అంతేకాకుండా వారిని ఘనంగా సత్కరించనున్నట్టుగా కూడా తెలిపింది. 

‘‘ఈ నెల 21 నుంచి 23 తేది వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదిల్లో  టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదిల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన  డ్రాప్ బాక్స్‌లలో వేయాలి. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10  మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. మొత్తం 11 రీజియన్ లలో కలిపి 110 విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులను అందజేస్తారు’’ అని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. 


సెప్టెంబర్ 31న రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించగా.. ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపింది. 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేసి వారికి రూ. 5.50 లక్షల నగదు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించినట్టుగా పేర్కొంది. రాఖీ పౌర్ణమి స్పూర్తితో దసరా, దీపావళి, సంక్రాంతి, తదితర పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. 

‘‘తెలంగాణలో బతుకమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో కొంతమందికి రాఖీ పౌర్ణమి మాదిరిగా లక్కీ డ్రా నిర్వహించి బహుమతులను సంస్థ అందజేయనుంది. ఈ నెల 21 నుంచి 23 తేది వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదిల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాకు అర్హులే. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది. రాఖీ పౌర్ణమి లాగే దసరా లక్కీ డ్రాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీఎస్ఆర్టీసీ ఆశిస్తోంది’’ అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు. దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.

బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోందని.. ప్రయాణికుల సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని సజ్జనార్ చెప్పారు. ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల రద్దీని  బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios