హుజూర్ నగర్:  హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయవాతావరణం మంచి కాక మీదుంది. అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్ర అగ్ర రాజకీయనేతలంతా హుజూర్ నగర్ లో తిష్ఠ  వేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేసేందుకు ఎత్తులు వాటికి పైఎత్తులు వేయడంలో తలమునకలైయున్నారు. 

కాంగ్రెస్ ఎలాగైనా తన సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని పట్టుదలగా ఉంటే, ఎలాగైనా కాంగ్రెస్ ని వారి సొంత సీట్లోనే ఓడించి విమర్శకుల నోర్లు మూయించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. మరోపక్క తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని నిరూపించుకోవడానికి ఇక్కడ ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. 

ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి రామారావు తరుపున ప్రచారం చేసారు. కెసిఆర్ మెడలు వంచే అద్భుత అవకాశం హుజూర్ నగర్ ప్రజలకు దక్కిందని సంజయ్ అన్నారు. 

రైతుబంధు పథకానికి సంబంధించిన డబ్బును కెసిఆర్ ఈ హుజూర్ నగర్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకొనే విడుదల చేసారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనీ కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆక్షేపించారు. 

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కెసిఆర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. ప్రోజెక్టుల గురించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రోజెక్టుల పేరిట కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ధ్వజమెత్తారు.