గోకుల్ చాట్ ఓనర్ ముకుంద్‌దాస్ కన్నుమూత..
గోకుల్ చాట్ స్థాపకుడు, ఓనర్ ముకుంద్‌దాస్ చనిపోయారు (Gokul chat owner Mukundas passed away). గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్ లో ప్రముఖ చాట్ సెంటర్ అయిన గోకుల్ చాట్ స్థాపకుడు, ఓనర్ ముకుంద్ దాస్ చనిపోయారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దాని కోసం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో తన 75 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు.
గోకుల్ చాట్ అంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన పేరు. ప్రతీ రోజు ఇక్కడికి వేలాది సంఖ్యలో చాట్ ప్రియులు వస్తుంటారు. ఈ సెంటర్ ను కోఠిలో 1966లో ముకుంద్ దాస్ ప్రారంభించారు. అనతి కాలంలోనే అది ఫేమస్ అయిపోయింది. అక్కడి చాట్ ను ఆస్వాదించేందుకు హైదరాబాద్ లోని నలుమూలల నుంచే కాక.. వివిధ పనుల నిమిత్తం రాజధానికి వెళ్లిన వారు తప్పకుండా సందర్శించేవారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో ఈ సెంటర్ లో ఉగ్రదాడి జరిగింది. ఇక్కడ తీవ్రవాదులు బాంబు పెట్టారు. అది పేలడంతో తీవ్ర విధ్వంసం జరిగింది. ఆ ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొంత కాలం పాటు గోకుల్ చాట్ మూతపడిపోయింది. అయితే చాట్ ప్రియులు సాయంతో మళ్లీ గోకుల్ చాట్ ను ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి ఇక్కడ భద్రత పెంచారు. కానీ ఇప్పటికీ ఈ సెంటర్ కు చాట్ ప్రియుల ఆదరణ ఏ మాత్రమూ తగ్గలేదు. కాగా.. ముకుంద్‌దాస్ చనిపోవడంతో సుల్తాన్ బజార్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.