హైదరాబాద్: గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా తెలంగాణకు ఉందని ఆ రాష్ట్రానికి నీటిపారుదల అధికారులు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగానే తెలంగాణకు గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా వస్తుందని తెలంగాణ అధికారులు వాదించారు. 

అయితే తెలంగాణ వాదనను ఏపి నీటిపారుదల అధికారులు తోసిపుచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా  నీటి పంపకాలపై తెలంగాణ చేస్తున్న వాదనపై   తీవ్రంగా అభ్యంతరం తెలిపారు ఏపీ అధికారులు.  బచావత్ ట్రిబ్యునల్ లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని నిలదీశారు ఏపీ అధికారులు. గోదావరి నీటి పంపకాలకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం అన్నారు. 

బచావత్ ట్రిబ్యునల్ ఎక్కడా తెలంగాణ కు నీటి కేటాయింపులు చేయలేదని ఏపి అధికారులు స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న గోదావరి బోర్డు నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతవరకు కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలకు బోర్డు ఆదేశించింది. ఈ నెల 10వ తేదీలోగా డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. బోర్డు ఆదేశాల మేరకు డీపీఆర్ లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు  అంగీకరించాయి.