ప్రేమ కోసం ఒకరు.. పరువు కోసం మరొకరు ప్రాణాలు వదిలారు. తాను కోరుకున్న ప్రేమ దక్కలేదని ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. ఆమె చావుకి తన కొడుకును కారకుడిని చేశారని.. పరువు పోయిందంటూ యువకుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంటకాపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పాలంపేట గ్రామానికి చెందిన బోడ సింధూజ (18) సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన కొంబత్తుల రమేష్‌ అనే వ్యక్తి ప్రేమపేరుతో మోసంచేయడంతోనే సింధూజ ఆత్మహత్య చేసుకున్నదని  బంధువుల ఆరోపించారు.

ఆమె మృతదేహాన్ని ఆ యువకుడి ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి దహనసంస్కారాలు చేయించారు. అయితే సింధూజ ఆత్మహత్యకు తన కుమారుడిని బాధ్యుడిని చేస్తూ ఇంటిఎదుట శవంతో ధర్నా చేయడంతో మనస్థాపం చెందిన రమేష్‌ తండ్రి రాజు అదే రోజు సాయంత్రం పురుగులమందు తాగాడు. వెంటనే అతడిని ములుగు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మరణించాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.