ఎంగేజ్ మెంట్ అయిపోయిన తర్వాత.. వరుడు తరపువారు పెళ్లి క్యాన్సిల్ చేశారని.. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ లోని బేగంబజార్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  బేగంబజార్ పొల్సువాడికి చెందిన సజ్జన్ లాల్, లక్ష్మీ బాయి దంపతుల కుమార్తె మమతకు రెండేళ్ల క్రితం కుల్సుంపురా జైన్ మందిర్ ప్రాంతానికి చెందిన ఆనంద్, అంబుల కుమారుడు రాజేష్ తో ఎంజేగ్ మెంట్ అయ్యింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి కూడా జరగుతుందని భావించారు.

అయితే.. వధువు మమత మైనర్ అన్న విషయం వరుడు తరపువారికి ఆలస్యంగా తెలిసింది.దీంతో.. మైనర్ తో వివాహం జరిపిస్తే.. పోలీసు కేసు అవుతుందని భావించి వారు పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఎంగేజ్ మెంట్ రోజున అబ్బాయికి పెట్టిన కానుకలు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.

విషయం తెలుసుకున్న వధువు మమత.. దిగ్భ్రాంతికి గురయ్యింది. పెళ్లి ఆగిపోయిందన్న విషయాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైంది. వెంటనే మూడో అంతస్థు భవనం పైకి ఎక్కి కిందకు దూకేసింది. తీవ్రగాయాలపాలైన మమతను.. ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.