హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ పాత్ర శూన్యమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యటిస్తున్న ఆజాద్ గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదని కొట్టిపారేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోరాడటంతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని అజాద్  తెలిపారు.

తమ ఎంపీలు అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్రం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ హైదరాబాద్, ఢిల్లీలో ప్రకటనలు చేయడం తప్ప చేసేందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్లే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.

లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, నాలుగున్నరేళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులనే భర్తీ చేయలేకపోయారని, ఇంక కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని ఆజాద్‌ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కువ అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు ఇచ్చేది కేసీఆరేనని విమర్శించారు. 

విద్యార్థులు, యువతను కేసీఆర్ మోసం చేశారని, ముస్లింల రిజర్వేషన్ల అంశంలోనూ మోసానికి పాల్పడ్డారని ఆజాద్ ఆరోపించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి తమనూ మోసం చేశారని తెలిపారు. పార్లమెంటులో మోదీ సర్కారుకు మద్దతిస్తున్న కేసీఆర్‌ రాష్ట్రంలో మాత్రం తిడుతూ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రభుత్వంలో ఎవరుంటే వారితో అంటకాగడం ఎంఐఎం పార్టీకి అలవాటని విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై స్పందించిన ఆజాద్ ఇందిరాగాంధీని ఆమె తండ్రి, రాజీవ్‌గాంధీని ఆయన తల్లి ప్రధానిగా నియమించలేదని వ్యాఖ్యానించారు.