వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి బలి.. అధికార యంత్రాంగంపై విమర్శలు, జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనలో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్పందించింది. ఈ మేరకు మేయర్ గద్వాల విజయలక్ష్మీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఐదేళ్ల బాలుడిని వీధి కుక్కలు బలి తీసుకున్న ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ మంగళవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. 3 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశానికి హాజరుకావాల్సిందిగా.. జోనల్ కమీషనర్లు, ఇతర ఉన్నతాధికారులను మేయర్ ఆదేశించారు. వీధి కుక్కల నిర్మూలన , జీహెచ్ఎంసీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
కాగా.. హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ ఆదివారం తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మూడు వీధి కుక్కలు.. చిన్నారిని చుట్టుముట్టాయి. అవి అరుస్తూ, దాడి చేస్తుండటంతో బాలుడు భయాందోళనలకుగురయ్యాడు. తప్పించుకునేందుకు ఆ చిన్నారి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆ కుక్కలు చిన్నారిపై దాడి చేస్తూ నోట కరచుకుని దాడి చేశాయి.
ప్రదీప్ తండ్రి అక్కడికి వచ్చేలోపే చిన్నారిని ఆ కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో బాబుని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లాడిపై కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.