హైదరాబాద్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ వందకు తగ్గకుండా కేసులు నమోదవుతుండటంతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

Also Read:జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉద్యోగికి కరోనా: తెలంగాణ సచివాలయంలో కలకలం

దీంతో మేయర్ బొంతుకు ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం కరోనా నిర్థారణ పరీక్షలు చేయనున్నారు. మరోవైపు కారు డ్రైవర్ ఇవాళ ఉదయం నుంచి డ్యూటీలో ఉండటంతో అతనితో ఎవరెవరు కలిశారు.. తదితర వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. 

కొద్దిరోజుల క్రితం బొంతు రామ్మోహన్‌కు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇటీవల నగరంలోని ఓ టీ దుకాణంలో మేయర్ టీ తాగారు. అయితే టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో, ముందు జాగ్రత్తగా ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

Also Read:టీ తయారు చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్: హైదరాబాద్ మేయర్‌కు వైద్య పరీక్షలు

కొంతమంది నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

అనివార్య పరిస్దితిలో సడలింపులు ఇవ్వడం జరిగిందని బొంతు వెల్లడించారు. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందని.. అయితే కొంతమంది జాగ్రత్తలు పాటిస్తున్నారని, మరికొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అందువల్లే కేసులు పెరుగుతున్నాయని మేయర్ వ్యాఖ్యానించారు.