హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ముఖ్యమైన పోలింగ్ ఘట్టం నిన్న(మంగళవారం) ముగిసింది. అయితే ఓట్లేయడానికి నగర ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ మందకోడిగా సాగింది. దీంతో నగరవ్యాప్తంగా మొత్తం పోలింగ్ శాతం కేవలం 46.60గా మాత్రమే నమోదయ్యింది. నగరంలో అన్ని డివిజన్లలో జరిగిన పోలింగ్ వివరాలను తాజాగా ఎస్ఈసీ ప్రకటించింది. 

డివిజన్ల వారిగా చూసుకుంటే  అత్యధికంగా ఆర్సీపురంలో 67.71శాతం పోలింగ్ జరిగింది. ఇక మెహదీపట్నంలో అత్యల్పంగా 34.41 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 7412601 మంది ఓటర్లుండగా తాజా ఎన్నికల్లో 3454552మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఇలా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌‌పై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.

READ MORE  మందకొడి పోలింగ్.. టీఆర్ఎస్ కుట్రే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించారని కేంద్ర మంత్రి అన్నారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరిపి ప్రభుత్వం వారిని అవమానించిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

 ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ పెట్టడం తిరోగమన చర్యగా కేంద్రమంత్రి అభివర్ణించారు.  పోలింగ్ శాతం తగ్గించడానికి టీఆర్‌ఎస్‌ లేనిపోని అపోహలు సృష్టించారని ఆయన విమర్శించారు.టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూశారని, కానీ పోలింగ్‌ సరళి చూశాక గెలుస్తామనే విశ్వాసం కలిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, గత ఎన్నికలలో పోలిస్తే ఈ సారి గ్రేటర్‌లో ఓటింగ్‌ శాతం భారీగా పడిపోయింది.