హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మీద తెలంగామ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాదు పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన బుధవారంనాడు స్పందించారు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటో తెలియకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

బండి సంజయ్ కి రాజకీయ అవగాహన లేదని ఆయన అన్నారు. కరీంనగర్ లో చిల్లర కార్పోరేటర్ గా గెలిచిన బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఎలా ఉంటుందో ర్థమవుతోందని ఆయన అన్నారు. బండి సంజయ్ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఏ డివిజన్ ఎక్కుడుందో కూడా బండి సంజయ్ కి తెలియదని ఆయన అన్నారు. 

బిజెపి, టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు విషయంలో, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కేసీఆర్ బిజెపికి మద్దతు పలికారా, లేదా అని ఆయన ప్రశ్నించారు.  

ప్రజలను మతపరంగా విభజించాలని బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెసు తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. టీఆర్ఎస్ అవినీతి సొమ్ము పంచి రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పాలన అవినీతిమయమని ఆయన అన్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఆయన అనుచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

బిజెపి మతంలో, టీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయాయని ఆయన అన్నారు. ప్రతి కేంద్ర మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శిస్తున్నారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఐటి, ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ఆయన అడిగారు. 

టీఆర్ఎస్, బిజెపిలు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. బండి సంజయ్ హైదరాబాదులో మతసామరస్యాన్ని చెడగొడుతున్నారని ఆయన అన్నారు. విజయశాంతి ఇంకా కాంగ్రెసులోనే ఉన్నారని మాణిక్యం ఠాగూర్ చెప్పారు.