ఎన్నో కష్టాలు, అవమానాలు, చీత్కారాలు భరించి ఎన్నికల్లో విజయం సాధించిన వారి ఆనందం అంతా ఇంతా కాదు. వీరిలో మొదటిసారి గెలిచిన వారు ఉండొచ్చు.. ఎన్నో ఓటముల తర్వాత వచ్చిన గెలుపు కావొచ్చు.

ఈ విజయం అభ్యర్ధితో పాటు కుటుంబసభ్యులకు సైతం ఎంతో ఉత్సాహన్ని ఇస్తుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది.

విజయాలు సాధించిన వారు విజయోత్సవాలు చేసుకుంటుంటే... ఓడిపోయిన వారు విషాదంగా కౌంటింగ్ కేంద్రాన్ని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో 112వ డివిజన్ రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పుష్ప భారీ మెజారిటీతో గెలిచారు.

సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌పై 3459 ఓట్లతో పుష్ప విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఆమె సంబరాల్లో మునిగిపోయారు.

ఆనందోత్సాహంతో ఆమె భర్త నగేశ్ యాదవ్ ముద్దు పెట్టి అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పుష్ప.. తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.