హైదరాబాద్: టీఆర్ఎస్, ఎంఐఎంలపై కేంద్ర మంత్రి, బిజెపి నేత స్మృతి ఇరానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయి నిబంధనలకు విరుద్దంగా రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాయని ఆమె ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాదు వచ్చిన స్మృతి ఇరానీ బుధవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎంఐఎం లేఖ రాసిందని, తమ పార్టీ లెటర్ హైడ్ మీద ఆ లేఖ రాసిందని ఆమె ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం అక్రమ చొరబాటుదార్లకు మద్దతు ఇస్తారా అని ఆమె అడిగారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లది అవినీతి కూటమి అని ఆమె అన్నారు. అక్రమ చొరబాటుదారులపై టీఆర్ఎస్ ఆధారపడిందని ఆమె ఆరోపించారు. అక్రమ చొరబాటుదారుల విషయాన్ని బిజెపి బయటపెట్టిందని ఆమె అన్నారు. అక్రమ చొరబాటు దారులను ఓటర్ల జాబితాలో చేర్చడం ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర అని ఆమె అన్నారు.

అక్రమ చొరబాటుదారుల విషయంపై బిజెపి స్పష్టమైన వైఖరి ఉందని ఆమె చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని ఆమె అన్నారు. బిజెపికి టీఆర్ఎస్ భయపడుతోందని ఆమె అన్నారు. దుబ్బాకలో బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని ఆమె విమర్శించారు. వరదల వల్ల హైదరాబాదు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారని ఆమె అన్నారు. హైదరాబాదు వరదల్లో 80 మంది మరణించారని ఆమె చెప్పారు. 

తెలంగాణ కోసం పలువురు అమరులయ్యారని, తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ఆమె అన్నారు. హైదరాబాదులో 75 వేలకు పైగా అక్రమ కట్టడాలున్నాయని ఆమె అన్నారు.  సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ బిజెపి నినాదమని ఆమె అన్నారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయమని, బిజెపి కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆమె అన్నారు.