ఓల్డ్‌ మలక్‌పేటలోని డివిజన్‌ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే దీనిని గుర్తించిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో డివిజన్‌ మొత్తం ఎన్నికను నిలిపి వేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించనున్నారు.

ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 26వ డివిజన్‌లో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ డివిజన్‌ పరిధిలో సుమారు 54,655 మంది ఓటర్లున్నారు.

ఇందులో పురుషులు 27889, స్త్రీలు 26763, ఇతరులు 3 ఉన్నారు. ఇక్కడ పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేయడంతో రద్దు అయిన రోజు ఓటు వేసినవారు కూడా మరోసారి ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది.

కాగా, ఇక్కడ పోలింగ్‌లో పాల్గొన్న వారి ఎడమ చేతి చూపుడు వేలికి ఇప్పటికే సిరా గుర్తు వేసినందున 3వ తేదీన జరిగే పోలింగ్‌ రోజున ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఈసీ నిర్ణయించింది. మొత్తం 69 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.