హైదరాబాద్: జీహీచ్ఎంసీ ఎన్నికల్లో కొంత మంది నాయకులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రచారానికి వస్తున్న నాయకులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ ను, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ ను స్థానికులు మంగళవారంనాడు అడ్డుకున్నారు. సమస్యలపై వారిని నిలదీశారు. దీంతో వారు మధ్యలోనే వెనుదిరిగి వెళ్లిపోయారు.

తాజాగా బుధవారంనాడు ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ కు ముషీరాబాద్ లో చేదు అనుభవం ఎదురైంది. బోలక్ పురా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. తమకు రాజకీయాలు అవసరం లేదని, అభివృద్ధి అవసరమని చెప్పారు. అక్బరుద్దీన్ ప్రసంగిస్తుండగా స్థానికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆయన మధ్యలోనే ప్రసంగం ఆపేసి వెనుదిరిగి వెళ్లిపోయారు. 

శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కూడా తార్నాకలో చేదు అనుభవం ఎదురైంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయనను మాణికేశ్వర్ నగర్ బస్తీవాసులు అడ్డుకున్నారు. వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలేదని వారు నిలదీశారు. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మంగళవారంనాడు జాంబాగ్ లో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అసదుద్దీన్ ను స్థానికులు నిలదీశారు. దీంతో ఆయన వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెనుదిరిగారు.