హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి బిజెపి పెద్దలు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఊపును జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కనబరచాలని బిజెపి ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని బిజెపి భావిస్తోంది. 

డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య అవగాహన ఉంది. కాగా, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయా, స్నేహపూర్వకమైన పోటీకి దిగుతాయా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ఓ విడత చర్చలు జరిపారు. 

బిజెపి హైదరాబాదు మేయరు పదవిని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. కనీసం 70 డివిజన్లలోనైనా కాషాయ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని సీనియర్ నాయకులకు గాలం వేస్తోంది. ఇ్పపటికే కాంగ్రెసు డీకె అరుణ బిజెపిలో చేరారు. మాజీ ఎంపీ, కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ సారథి విజయశాంతి త్వరలో కాషాయం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో పెద్ద పదవినే ఇస్తామని బిజెపి నేతలు విజయశాంతికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల లోపు విజయశాంతిని పార్టీలో చేర్చుకోవాలని బిజెపి నాయకులు ఆలోచిస్తున్నారు. 

ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి బిజెపి నేతలు గాలం వేస్తున్నట్లు ప్రచాంర సాగుతోంది. దుబ్బాకలో ఘరోమైన ఓటమి చూసిన నేపథ్యంలో కాంగ్రెసు పీసీసీ మార్పుపై చర్చ సాగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. పీసీసీ అధ్యక్ష పీఠాన్ని రేవంత్ రెడ్డికి అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే, పలువురు సీనియర్లు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. 

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వారు పార్టీ నుంచి తప్పుకునే ప్రమాదం లేకపోలేదు. దీంతో కాంగ్రెసు అధిష్టానానికి కక్కలేక మింగలేక అనే పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కడం అనేది కొంత దుర్లభంగానే కనిపిస్తోంది. ఈ స్థితిలో తమ పార్టీలోకి రేవంత్ రెడ్డిని రప్పించుకోవాలనే ప్రయత్నాల్లో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. 

పీసీసీ పదవి దక్కకపోయినా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమి పాలైనా రేవంత్ రెడ్డి కాంగ్రెసును వీడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన బిజెపిలో చేరినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది. ఏమైతై అది అవుతుందని కాంగ్రెసు అధిష్టానం సాహసం చేసి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే మాత్రం పరిస్థితి మారవచ్చునని అంటున్నారు.