హైదరాబాద్: ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. దమ్ముంటే ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన సవాల్ మీద ఆయన ప్రతిస్పందించారు. దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని, అది జరిగిన క్షణాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ దారుసలాంను కూలుస్తామని బండి సంజయ్ అన్నారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బుధవారంనాడు వివిధ ప్రాంతాల్లో బండి సంజయ్ ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు. తాము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఆనయ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు సిగ్గుపడాలని ాయన అన్నారు. వరదలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ బయటకు రాలేదని ఆయన అన్నారు. 

హుస్సేన్ సాగర్ చాలా వరకు అక్రమ ఆక్రమణల వల్ల కుదించుకుపోయిందని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని ఆయన అన్నారు. పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తారా అని ఆయన అడిగారు. 

బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. రోహింగ్యాలపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్జికల్ స్డ్రేక్ చేస్తామని బండి సంజయ్ అంటున్నారని, మరి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైందని ఆయన అన్నారు. ఇన్నాళ్లు ఏం చేశారని ఆయన అడిగారు. 

ఎన్నికల కోసం బిజెపి అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ మీద పడి ఏడ్వడం కాదు, హైదరాబాదుకు ఏం చేశారో చెప్పాలని ఆయన బిజెపిని సవాల్ చేశారు. కరీంనగర్ లో ఉండే సంజయ్ కు హైదరాబాదు గురించి ఏం తెలుసునని ఆయన అడిగారు.