హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేయడం లేదు. జిహెచ్ఎంసి ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండనుంది. ఈ విషయాన్ని వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమంతా వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి వైఎస్ జగన్ కు సూచించినట్లు వార్తలు వచ్చాయి. 

రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ జగన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఈ స్థితిలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి పెద్దగా కార్యక్రమాలేవీ చేపట్టలేదు. పైగా, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుతో వైఎస్ జగన్ కు సత్సంబంధాలున్నాయి. 

ఇదిలావుంటే, తెలంగాణలో ఒకప్పుడు అత్యంత బలంగా ఉన్న టీడీపీ పూర్తిగా బలహీనపడింది. అయినప్పటికీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 82 సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేయలేదు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. రేపు శుక్రవారం మధ్యాహ్నానికి జాబితాను విడుదల చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

పార్టీలు కసరత్తు చేసుకోవడానికి తగిన సమయం లేకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలు మీద పడ్డాయి. అప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్న టీఆర్ఎస్ గురువారం మరో 20 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. 105 మందితో బుధవారంనాడు తొలి జాబితాను విడుదల చేసింది. 

కాంగ్రెసు, బిజెపిలు కూడా ఇంకా చాలా వరకు అభ్యర్థులను ప్రకటించాల్సే ఉంది. గురువారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.