హైదరాబాద్: కాంగ్రెసు నాయకురాలు, సినీ నటి విజయశాంతి రేపు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఆమె ఢిల్లీ పయనం పెట్టుకున్నారు. ఆమె ఢిల్లీలో బిజెపి అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉంది. 

చాలా కాలంగా విజయశాంతి కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ ఆమె దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా, బిజెపికి అనుకూలంగా ఆమె ప్రకటన కూడా చేశారు. 

విజయశాంతి బిజెపిలో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆమె తన అభిప్రాయాన్ని ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్తున్నారు. 

విజయశాంతిని బుజ్జగించడానికి కాంగ్రెసు తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. ఆ మధ్య ఆమెను బిజెపి నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కలిశారు. అప్పటి నుంచే ఆమె బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. 

బిజెపిలో చేరి ఆమె బిజెపి తరఫున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా, లేదా వేచి చూడాల్సి ఉంది. చాలా కాలంగా ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రంగా మండిపడుతున్నారు.