హైదరాబాద్:  జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అలజడి సృష్టించే కుట్ర జరుగుతోందని, అందుకు సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పుకార్లతో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

సర్జికల్ స్ట్రైక్ అన్నవారిపై చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి చెప్పారు. తాము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని అధిష్టిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న విషయం తెలిసిందే. రోహింగ్యాలకు సంబంధించి ఇప్పటి వరకు 60 కేసులు పెట్టామని ఆయన చెప్పారు. 

ఏడేళ్లుగా హైదరాబాదులో ఏ విధమైన అల్లర్లు లేవని ఆయన చెప్పారు. ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. పోలీసులకు చేదోడువాదోడుగా ఉండాలని ఆయన కోరారు. సోషల్ మీడియాలో పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఆయన చెప్పారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 90 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. 50 వేల మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెపపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఘటనకు సంబంధించి దృశ్యాలను రికార్డు చేశామని, న్యాయ సలహాలు తీసుకుని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు