హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. దివంగత నేత, మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెసుకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గోషామహల్ శాసనసభ నియోజకవర్గానికి చెందిన విక్రమ్ గౌడ్ కాంగ్రెసుకు అల్టిమేటమ్ ఇచ్చారు. 

విక్రమ్ గౌడ్ బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గోషా మహల్ నియోజకవర్గంలోని కాంగ్రెసు నేతల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంది. గోషామహల్ డివిజన్ టికెట్ తన వర్గీయులకు ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని విక్రమ్ గౌడ్ చెప్పారు. 

విక్రమ్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు వాటిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ పీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెసు నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

బీ ఫారాలు దక్కని పలువురు కాంగ్రెసు నాయకులు నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి కాంగ్రెసు నాయకులకు వల వేస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ బిజెపిలో చేరడానికి సిద్ధపడ్డారు.  బిజెపి నియోజకవర్గాల కాంగ్రెసు ఇంచార్జీలపై బిజెపి వల విసురుతోంది. 

కాంగ్రెసులో ఉన్న అసంతృప్తి నేతలను గుర్తించడానికి బిజెపి ఈ టీమ్ ను  ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. టీమ్ గుర్తించిన నాయకులతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బడా నాయకులతో ఢిల్లీ పెద్దలు కూడా మాట్లాడుతున్నట్లు సమాచారం.