హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదని ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. తాను బిజెపిలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. 

తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఇష్టమని ఆయన చెప్పారు.  జయాపజయాలు సహజమని పోసాని కృష్ణమురళి శనివారం మీడియా సమావేశంలో అన్నారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు జై కొట్టిన విషయం తెలిసిందే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు కూడా ఎదురు కాలేదని ఆయన చెప్పారు. 

ఉద్యమ కాలంలో తెలియకుండా ఉద్రిక్తతలో కేసీఆర్ కొన్ని మాటలు మాట్లాడి ఉండవచ్చునని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆవేశపడ్డారని, అవతలి వాళ్లు కూడా వ్యాఖ్యలు చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత అటువంటి సమస్యలేవీ లేవని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్ వల్ల స్థానికేతరులకు ఏ విధమైన ఇబ్బందులు కలగలేదని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్లను కేసీఆర్ తెలంగాణవాళ్లతో సమానంగా చూశారని  ఆయన చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రోజు కూడా పవర్ కట్ లేదని ఆయన అన్నారు. గతంలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలిసేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నాశమై పోతుందని, విధ్వంసం జరుగుతుందని, నీల్లు ఉండవని ప్రచారం చేశారని, కానీ అవన్నీ అబద్ధాలని కేసీఆర్ ప్రభుత్వం తేల్చేసిందని ఆయన అన్నారు. 

కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాదు అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు భారతదేశంలో ఎక్కడా లేదని ఆయన కొనియాడారు. తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని ఆయన చెప్పారు.

తెలంగాణ వస్తే ఆంధ్రవాళ్లను తరిమికొడుతారనే అనుమానం ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క దాడి కూడా జరగలేదని పోసాని చెప్పారు. కేసీఆర్ మత సామరస్యాన్ని కాపాడారని ఆయన చెప్పారు.