Asianet News TeluguAsianet News Telugu

జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ కు జై కొట్టిన పోసాని కృష్ణమురళి

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ సీఎం కేసీఆర్ కు జైకొట్టారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

GHMC elections 2020: Posani Krishna murali supports KCR
Author
Hyderabad, First Published Nov 21, 2020, 11:49 AM IST

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు జై కొట్టారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు కూడా ఎదురు కాలేదని ఆయన చెప్పారు. 

ఉద్యమ కాలంలో తెలియకుండా ఉద్రిక్తతలో కేసీఆర్ కొన్ని మాటలు మాట్లాడి ఉండవచ్చునని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆవేశపడ్డారని, అవతలి వాళ్లు కూడా వ్యాఖ్యలు చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత అటువంటి సమస్యలేవీ లేవని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్ వల్ల స్థానికేతరులకు ఏ విధమైన ఇబ్బందులు కలగలేదని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్లను కేసీఆర్ తెలంగాణవాళ్లతో సమానంగా చూశారని  ఆయన చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రోజు కూడా పవర్ కట్ లేదని ఆయన అన్నారు. గతంలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలిసేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నాశమై పోతుందని, విధ్వంసం జరుగుతుందని, నీల్లు ఉండవని ప్రచారం చేశారని, కానీ అవన్నీ అబద్ధాలని కేసీఆర్ ప్రభుత్వం తేల్చేసిందని ఆయన అన్నారు. 

కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాదు అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు భారతదేశంలో ఎక్కడా లేదని ఆయన కొనియాడారు. తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని ఆయన చెప్పారు.తెలంగాణ వస్తే ఆంధ్రవాళ్లను తరిమికొడుతారనే అనుమానం ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క దాడి కూడా జరగలేదని పోసాని చెప్పారు. కేసీఆర్ మత సామరస్యాన్ని కాపాడారని ఆయన చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios