హైదరాబాద్:  జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తన రోడ్ షోలో బిజెపిని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లిలోని ఓల్డ్ అల్లాపూర్ నుంచి తన రోడ్ షోను ఆయన ప్రారంభించారు. గత ఆరేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ది చేశామని ఆయన చెప్పారు. 

ఎన్నికలు వస్తే మాటలు చెబుతున్నారని ఆయన చెప్పారు.  ఓట్ల కోసం బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్ారని ఆయన అన్నారు. హైదరాబాదు వరద బాధితులకు వరదసాయాన్ని ఆపించిన నేత తాము గెలిస్తే రూ.25 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇస్తున్నారని ఆయన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని ఉద్దేశించి అన్నారు. 

ఇప్పటి వరకు వరదసాయాన్ని రూ.10 వేల చొప్పున 6 లక్షల 50 వేల మందికి ఇచ్చామని ఇచ్చామని, వరద సాయం అందనివారికి కూడా తర్వాత అందిస్తామని ఆయన చెప్పారు. కథలు చెప్పే నమ్మే అమాయకుల హైదరాబాదు కాదు, హుషారు హైదరాబాద్ అని ఆయన అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చి ఆరేళ్లవుతోందని అంటూ హైదరాబాదుకు ఒక్క పనైనా చేశారా, దమ్ముంటే కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన అన్నారు. 

ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, హైదరాబాదులో నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. బండి సంజయ్ కావాలని పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారని ఆయన అన్నారు. తమకు కూడా దైవం మీద నమ్మకం ఉందని ఆయన అన్నారు. 

హిందూ ముస్లింలు కలిసి ఉండి హైదరాబాదు పచ్చగా ఉంటే వారికి కళ్లు మండుతున్నాయని ఆయన అన్నారు. పచ్చగా పిల్లపాపలతో కలిసి ఉండే ప్రశాంతమైన హైదరాబాదు కావాలా, కర్ఫ్యూలతో తల్లడిల్లే హైదరాబాదు కావాలా తేల్చుకోవాలని ఆయన హైదరాబాదు ఓటర్లను ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం వల్లనే పరిశ్రమలు వస్తున్నాయని ఆయన చెప్పారు హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ ఆగమవుతుందని ఆయన అన్నారు.