జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌‌పై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించారని కేంద్ర మంత్రి అన్నారు.

పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరిపి ప్రభుత్వం వారిని అవమానించిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read:మందకొడి పోలింగ్.. టీఆర్ఎస్ కుట్రే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ పెట్టడం తిరోగమన చర్యగా కేంద్రమంత్రి అభివర్ణించారు.  పోలింగ్ శాతం తగ్గించడానికి టీఆర్‌ఎస్‌ లేనిపోని అపోహలు సృష్టించారని ఆయన విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూశారని, కానీ పోలింగ్‌ సరళి చూశాక గెలుస్తామనే విశ్వాసం కలిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, గత ఎన్నికలలో పోలిస్తే ఈ సారి గ్రేటర్‌లో ఓటింగ్‌ శాతం భారీగా పడిపోయింది.

సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. వరుస సెలవులు ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.