హైదరాబాద్: పీవీ ఘాటు వద్ద బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. డ్రామాలు వద్దని ఆమె బండి సంజయ్ కి సూచించారు. ఎన్టీఆర్ కు, పీవీకి భారత రత్న అవార్లు ప్రకటించేలా చూడాలని, అంతవరకు నాటకాలు ఆడి ఓట్లు అడిగే హక్కు బిజెపికి లేదని ఆమె అన్నారు. 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రెస్ మీట్ పెట్టడానికి ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చారని ఆమె అన్నారు.  గురువారం ఉదయం కవిత గాంధీనగర్ లో గల పాన్ షాపు వద్ద ముచ్చటించారు. హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్ గా మారిందని ఆమె అన్నారు. బిజెపి నేతలు డుప్లికేట్ మాటలు చెప్తే ఎవరూ నమ్మరని ఆమె అన్నారు. 

కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అడగలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, అడగనప్పటికీ ఆరు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇచ్చిందని ఆమె అన్నారు. బిజెపి నేతల్లో విచిత్రమైన ప్రవర్తన కనిపిస్తోందని, బిజెపి నేతలు విచిత్రమైన పదజాలం వాడుతున్నారని ఆమె అన్నారు. 

బిజెపి నేతలు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు హిందూముస్లిం అంటూనే మాట్లాడుతారని, వాళ్లు ఎక్కడైనా అదే చేస్తారని, అభివృద్ధి గురించి మాట్లాడబోరని కవిత అన్నారు. దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతారని ఆమె అన్నారు.