హైదరాబాద్: రాజకీయం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని తెలుగు సినీ డైరెక్టర్ శంకర్ జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి సలహా ఇచ్చారు. హిందువులను విడదీయవద్దని ఆయన కోరారు ఓ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తన భాషను కూడా మార్చుకోవాలని ఆయన సూచించారు. 

అహింసామార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన గుర్తు చేశారు. ఉద్యమాలకు, పోరాటాలకు వెనకాడని నేల తెలంగాణ అని ఆయన అన్నారు. ఆరేళ్లలో తెలంగాణలో సాధించిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని ఆయన అన్నారు. 

కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే శాంతిభద్రతల వ్యవస్థను పటిష్టపరిచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ఏర్పాటు చేశారని ఆయన ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ హబ్ మరింతగా అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. ఒకప్పుడు హైదరాబాదులో నీటి సమస్య ఎంతు దారుణంగా ఉండేదో అందరికీ తెలుసునని, ఇప్పుడు ఆ సమస్య లేదని ఆయన అన్నారు. 

పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయంటే హైదరాబాదులో శాంతిభద్రతలు బాగా ఉండడమే కారణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు నాలాల నిర్మాణం సరిగా చేయకపోవడం వల్లనే హైదరాబాదులో వరదలు పచ్చి ప్రజలు నష్టపోయారని ఆయన అన్నారు. అయినా కూడా వరద బాధితులకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకుందని ఆయన చెప్పారు.

భారతదేశంలోనే హైదరాబాదు శాంతిభద్రతలు ఉత్తమంగా ఉన్నాయని, గతంలో చైన్ స్నాచింగ్ చేయడం చాలా వరకు చాలా సులువుగా ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి ఘటనలు చాలా అరుదు అని ఆయన అన్నారు. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు.