హైదరాబాద్:  తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డిపై, ఎస్ఈసీ పార్థసారథిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ గుండాలను డీజీపీ చూసీచూడనట్లుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో స్పందించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. అబద్ధాలతో విజయం సాధించాలనే టీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారని ాయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని, అవినీతిని ప్రజలు వ్యతిరేకించారని ఆయన అన్నారు. కారు... సారు. రారని తాము చెప్పింది నిజమైందని అన్నారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ ఎంఐఎం, టీఆర్ఎస్ తమపై దుష్ప్రచారం చేశాయని ఆయన అన్నారు. ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రజలు ఓటేశారని ఆయన అన్నారు. కబ్జాలు, కమిషన్లతో వ్యవహారాలు నడిపారని ఆయన విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని ప్రజలు తీర్పు నిచ్చారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంతకు ముందు అన్నారు. 

కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు.  తమకు పూర్తి బాధ్యతలు ఇచ్చి ఉంటే హైదరాబాద్ పేరు భాగ్యనగర్ గా మారేదని ఆయన అన్నారు. 

భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బిజెపి విజయం  సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.గెలిచిన బిజెపి కార్పొరేట్ అభ్యర్థులతో కలిసి భాగ్య లక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటామని ఆయన చెప్పారు.

ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ఉంటే బిజెపి తప్పకుండా అత్యధిక మెజారిటీ సాధించి ఉండేదని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆఘమేఘాల మీద ఎన్నికలు నిర్వహించి కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన అన్నారు. 

కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను ప్రజలు వ్యతిరేకిస్తూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లేశారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పడానికి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆమె అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాలం చెల్లినట్లేనని అరుణ అన్నారు. ఆఘమేఘాల మీద ఎన్నికలకు వెళ్లినా కేసీఆర్ కు ఫలితం దక్కలేదని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని బిజెపి ఓబీసీ విభాగం జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనపై, అవినీతిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు బిజెపికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తును ప్రజలు గమనించి తమ పార్టీకి ప్రజలు ఓటేశారని ఆయన చెప్పారు.