హైదరాబాద్: దుబ్బాక శాసనసభ ఎన్నికల జోష్ లో ఉన్న బిజెపి గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ను రంగంలోకి దించింది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో వ్యూహరచన చేసి, అమలు చేసిన భూపేందర్ యాదవ్ అద్భుతమైన ఫలితాలు సాధించారు. దాంతో హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల వ్యూహరచనకు, దాని అమలుకు భూపేందర్ యాదవ్ ను రంగంలోకి దించింది.

రాజ్యసభ సభ్యుడైన యాదవ్ బిజెపి బీహార్ వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరించారు. ఆయన పర్యవేక్షణలో బీహార్ లో ఎన్డీఎ ఘన విజయం సాధించింది.  బిజెపి స్వయంగా 72 స్థానాలు గెలుచుకుంది. నీతిష్ కుమార్ నాయకత్వంలోని జెడీయు 42 సీట్లలో విజయం సాధించింది. 

జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మరింత మంది జాతీయ నాయకులను కూడా బిజెపి రంగంలోకి దించుతోంది. వారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ తో పాటు మహారాష్ట్ర బిజెపి నాయకుడు ఆశిష్ షేలార్, గుజరాత్ నేత ప్రదీప్ సింగ్ వాఘేా, కర్ణాటక శాసనసభ్యుడు సతీష్ రెడ్డి ఉన్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 23 మంది సభ్యులతో కూడిన ఎన్నికల మేనేజ్ మెంట్ జట్టును కూడా బిజెపి ప్రకటించింది. ఈ కమిటీకి పార్టీ ఓబీసీ జాతీయాధ్యక్షుడు కె. లక్ష్మణ్ కన్వీనర్ గా ఉంటారు. మాజీ ఎంపీలు డాక్టర్ వివేక్, గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జాయింట్ కన్వీనర్లుగా ఉంటారు.

కమిటీలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ, ఎంపీలు అర్వింద్, బాపురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, సీనియర్ నాయకులు పి. మురళీధర్ రావు తదితరులు ఉన్నారు.