హైదరాబాద్: బ్యాలెట్ పత్రంపై స్వస్తిక్ గుర్తు మాత్రమే కాకుండా ఏ మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) సర్క్యులర్ జారీ చేయడంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ సర్క్యులర్ జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కౌంటింగ్ అధికారులకు మాత్రమే ఆ సర్క్యులర్ జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన అడిగారు. 

ప్రగతి భవన్ నుంచి ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్ ఆ సర్క్యులర్ జారీ చేశారని ఆయన విమర్శించారు. తక్షణం సర్క్యులర్ ను రద్దు చేయాలని, ఈ సంఘటనపై విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

సర్క్యులర్ జారీపై హైకోర్టుకు వెళ్తాం గానీ ఓట్ల లెక్కింపును అడ్డుకోబోమని ఆయన స్పష్టం ేచశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి, ఎస్ఈసీకి గుణపాఠం తప్పదని ఆయన అన్నారు. ఎస్ఈసీని ఆయన గ్యాంబ్లర్ గా అభివర్ణించింది. ఎస్ఈసీ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. 

పోలింగ్ రోజు 3 గంటల వరకు గంటగంటకూ పోలింగ్ శాతం వివరాలు అందించిన అధికారులకు సాయంత్రం 5,6 గంటల మధ్య జరిగిన పోలింగ్ శాతం ఇవ్వడానికి అర్థరాత్రి దాకా ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు సాయంత్రం 4,6 గంటల మధ్య పథకం ప్రకారం టీఆర్ఎస్ పోలింగ్ శాతం పెంచిందని ఆయన విమర్శించారు 

సీఎస్, డీజీపీ, మాజీ డీజీపీ, ఇద్దరు ఐఎఎస్ అధికారులు స్కెచ్ వేసి జిహెచ్ఎంసీ కార్యాలయంలో అర్థరాత్రి కూర్చుని టీఆర్ఎస్ కు అనుకూలంగా పోలింగ్ శాతాన్ని మార్చారని ఆయన ఆరోపించారు. ఎంపిక చేసుకున్న డివిజన్లలో టీఆర్ఎస్, ఎంఐఎం రిగ్గింగ్ చేశాయని అన్నారు. ఘాన్సీ బజార్ లో 93 శాతం పోలింగ్ మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ఎస్ఈసీని ప్రశ్నించారు.