హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. జాంబాగ్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన ఆయనకు మహిళల నుంచి నిరసన వ్యక్తమైంది.

తమకు వరదాసాయం అందలేదని వారు అసదుద్దీన్ ఓవైసీకి ఫిర్యాదు చేశారు. కష్టకాలంలో తమను ఆదుకోకుండా ఓట్లు అడగడానికి ఎలా వస్తారని వారు నిలదీశారు. వారికి సమాధానం చెప్పకుండా ఓవైసీ వెనుదిరిగారు. 

హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం బలంగా ఉన్న విషయం తెలిసిందే.. 2016 ఎన్నికల్లో మజ్లీస్ తన సత్తా చాటింది. అదే ఊపుతో ఈసారి ఎన్నికల్లోనూ తన ప్రాబల్యాన్ని చాటడానికి ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ తో పొత్తు లేదని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.

డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన  ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. ఈసారి బిజెపి నుంచి గట్టి పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది.