హైదరాబాద్‌: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానందంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు అతి చేయవద్దని పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. మరీముఖ్యంగా రోడ్లపై, జనావాసాల్లో టపాసులు పేల్చకూడదని... ఇప్పటికే నిషేదానికి సంబంధించిన ఆజ్ఞలు అమల్లో వున్నాయని గుర్తుచేశారు. నిబంధనలు బేఖాతరు చేస్తే కఠినంగా శిక్షిస్తామని సిపి హెచ్చరించారు. 

హైదరాబాద్‌ పోలీస్‌ యాక్ట్‌ , సెక్షన్‌-67(సి)ప్రకారం ఆదేశాలను బేఖాతరు చేసే వారిపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌, సికింద్రబాద్‌ పరిధిలో ఈ నిషేదాజ్ఞలు 4వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటాయని సిపి వెల్లడించారు. 

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ముఖ్యమైన పోలింగ్ ఘట్టం మంగళవారం ముగియగా ఉత్కంఠభరితమైన కౌటింగ్ ప్రక్రియ శుక్రవారం జరగనుంది. ఎన్నికల్లో ఓట్లేయడానికి నగర ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ మందకోడిగా సాగింది. దీంతో నగరవ్యాప్తంగా మొత్తం పోలింగ్ శాతం కేవలం 46.60గా మాత్రమే నమోదయ్యింది. ఇలా తక్కువ ఓటింగ్ శాతం నమోదవడం ఎవరికి అనుకూలిస్తుందో చూడాలి. 

డివిజన్ల వారిగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే చూసుకుంటే  అత్యధికంగా ఆర్సీపురంలో 67.71శాతం జరిగింది. ఇక మెహదీపట్నంలో అత్యల్పంగా 34.41 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 7412601 మంది ఓటర్లుండగా తాజా ఎన్నికల్లో 3454552మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదయిన మెహదీపట్నం ఫలితమే మొదట వెలువడే అవకాశాలున్నాయి.

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌‌పై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పోలింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.