హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కమిషనర్ దాన కిషోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ సెంటెన్స్ పాఠశాల ఎదురుగా రోడ్డుపై భవన నిర్మాణానికి  సంబంధించిన వ్యర్థాలు వేసినందుకు వాణిజ్య విభాగానికి పదివేల రూపాయలు జరిమానా విధించారు. బహిరంగ మూత్ర విసర్జన చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. 

అలాగే మెట్టుగూడ లో ఇరుకైన గల్లీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను కమిషనర్ తనిఖీ చేశారు. 
ఇంటింటి నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోలకు అందించాలని  నివాసితులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలు రెగ్యులర్ గా వస్తున్నాయా, పారిశుధ్య సిబ్బంది స్వీపెంగ్ చేస్తున్నారా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 

నగరంలో ఎక్కడైనా డ్రైనేజ్ లీకేజీ, వాటర్ పైప్ లీకేజ్ ఉంటే సంబంధిత జలమండలి అధికారులపై చర్యలు  చేపడతామని దానకిషోర్ హెచ్చరించారు. అలాగే 
ఆలుగడ్డ బావి సమీపం లో పబ్లిక్ టాయిలెట్లు పరిశీలించిన కమిషనర్ టాయిలెట్లలో మరింత పరిశుభ్రత పాటించాలని సూచించారు. బ్రాండింగ్ చేయాలని ఆదేశించారు.


ప్రధాన రహదారులపై నిర్మాణ వ్యర్ధాలు, రాళ్లు తొలగించకపోవడం పట్ల జిహెచ్ఎంసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మెట్టుగూడా స్మశానవాటికను పరిశీలించారు కమిషనర్. శ్మశాన వాటికను శుభ్రంగా ఉంచడంతో పాటు లోపలికి అక్రమంగా వెళ్లకుండా ఉండేందుకు గేట్ ను ఏర్పాటు చేసి ప్రహరీ గోడకు పెయింటింగ్స్ వెయ్యాలని ఆదేశించారు.