బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీకి చెందిన జీహెచ్ఎంసీ మహిళా కార్పోరేటర్లు ఆయనకు బాసటగా నిలిచారు. ఎక్కడైనా దొంగను దొంగే అంటారని.. ముద్దేం పెట్టుకోం కదా అంటూ వారు వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు గులాబీ శ్రేణులు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజయ్‌పై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్ర మహిళా కమీషన్ సైతం సంజయ్‌కి నోటీసులు ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులకు కౌంటరిచ్చారు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పోరేటర్లు. సంజయ్ ఏ విధంగా కవితను అవమానించారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దొంగను దొంగే అంటారని.. వాళ్లనేం ముద్దు పెట్టుకోం కదా అని బీజేపీ మహిళా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
బండి సంజయ్‌పై కేసులు పెట్టడం, దిష్టిబొమ్మను తగులబెట్టినంత మాత్రన ధర్మం, న్యాయం ఓడిపోవన్నారు. గవర్నర్ తమిళిసైని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అసభ్యపదజాలంతో దూషించారని మరి అప్పుడేం అయ్యిందని వారు నిలదీస్తున్నారు. తెలంగాణలో మహిళా కమీషన్ ఇప్పటి వరకు నిద్రపోయిందా అని బీజేపీ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతుంటే మహిళా కమీషన్ ఏం చేసిందని వారు నిలదీస్తున్నారు.
Also Read: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై పోలీసు కేసు నమోదు..
తొమ్మిదేళ్ల కాలంలో ఒక్కరంటే ఒక్కరికైనా రాజ్యసభలో చోటు కల్పించారా అని వారు ప్రశ్నిస్తున్నారు. బీసీ బిడ్డ గుండు సుధారాణి రాజ్యసభ సభ్యురాలి హోదాలో బీఆర్ఎస్‌లో చేరితే.. ఆమెను వరంగల్ మేయర్ స్థాయికి తీసుకొచ్చారని బీజేపీ మహిళా నేతలు దుయ్యబట్టారు. మహిళ అంటే కేసీఆర్‌కు కేవలం ఆయన కుమార్తెనంటూ వారు చురకలంటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లంటూ కవిత దీక్ష చేశారని.. మరి కేబినెట్‌లో ఆ లెక్క ప్రకారం ఆరుగురు మహిళా మంత్రులు వుండాలి కదా అంటూ వారు దుయ్యబట్టారు.
గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే మంత్రి సత్యవతి రాథోడ్ కనీసం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించలేదని.. కవితకు ఏమైందని ఢిల్లీకి పరిగెత్తావంటూ మహిళా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కవిత స్కాంలో వాటా కోసం పరుగులు తీస్తున్నావా అంటూ వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు ఎక్కడున్నారని వారు నిలదీస్తున్నారు. దానం నాగేందర్ నాలుగు పార్టీలు మారారంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ మెప్పు కోసం ఏదిపడితే అది మాట్లాడుతున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
