తెలంగాణ మీదుగా ఏపి నుండి మహారాష్ట్రకు అక్రమంగా  భారీ గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టబడింది. నల్గొండ జిల్లాలోని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై డీఆర్ఐ అధికారులు పక్కా సమాచారంతో ఓ వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. దీంతో వాహనంలో ప్లైయాష్ ఇటుకల మధ్యలో పెట్టి  తరలిస్తున్న  దాదాపు 1121 కిలోల గంజాయి సంచులను  అధికారులు గుర్తించారు. 

డైరెక్టరేట్ ఆఫ్ స్పెషల్ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు ముంందుగానే ఈ అక్రమ గంజాయి తరలింపుపై సమాచారం అందింది. దీంతో వారు చౌటుప్పల్ సమీపంలోని పతంగా టోల్ గేట్ వద్ద కాపు కాశారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఓ వాహనం భారీగా ప్లైయాష్ ఇటుకల లోడుతో వుండటంతో అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇలి పైన ఇటుకలను పక్కకు తీయగా లోపల గంజాయి సంచలు కుప్పలు కుప్పలుగా వున్నాయి. 

మొత్తం 546 సంచులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి బరువు  1121 కేజీలుగా నిర్ధారించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1, 68,22,500 లు వుంటుందని తెలిపారు. ఈ గంజాయి ఆంధ్ర ప్రదేశ్ సీలేరు ఏజన్సీ ప్రాంతం  నుండి మహారాష్ట్ర షోలాపూర్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

పట్టుబడ్డ గంజాయి పాకెట్లతో పాటు వాటిని తరలించడానికి ఉపయోగించిన డిసిఎం వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తరలింపుకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని విచారించి గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తామని పోలీసులు తెలిపారు.