తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి కొందరు యువకులు నేరాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరబాద్ లో గంజాయి బ్యాచ్ (ganja batch) హల్ చల్ చేస్తోంది. ఇటీవల పాతబస్తీలో కొందరు యువకులు గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. పోలీస్ వాహనమెక్కి మరీ గంజాయి బ్యాచ్ అలజడి సృష్టించిన ఘటన మరువక ముందే ఇదే పాతబస్తీలో మరో దారుణం చోటుచేసుకుంది. గొడవ పడొద్దంటూ మంచిమాటలు చెప్పిన వ్యక్తిని గంజాయి బ్యాచ్ హత్యాయాత్నానికి పాల్పడింది.
హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కొందరు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. వారిలో వారే గొడవపడుతుండగా షరీఫ్ అనే వ్యక్తి సముదాయించేందుకు ప్రయత్నించాడు. దీంతో గంజాయి బ్యాచ్ అంతా ఏకమై షరీఫ్ పై తిరగబడ్డారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు గొడవొద్దని హితవు చెప్పిన షరీఫ్ పైనే కత్తితో దాడిచేసారు. దీంతో షరీఫ్ రక్తపుమడుగులో అక్కడిక్కడే కుప్పకూలాడు.
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడివున్న షరీఫ్ ను దగ్గర్లోని ఉస్మానియా హాస్పిటల్ కు తలరించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
ఈ హత్యాయత్నంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం గంజాయి బ్యాచ్ కోస గాలిస్తున్నట్లు బహదూర్ పుర పోలీసులు తెలిపారు. వీరికి గంజాయి ఎలా లభించింది..? ఎవరు అమ్మారు..? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలావుంటే ఇటీవల పాతబస్తీ ఆసిఫ్నగర్లో రెండురోజుల క్రితం ఇలాగే గంజాయి మత్తులో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. జిర్రా ప్రాంతంలోని రాయల్టీ హోటల్ దగ్గర యువకులు గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. ఇందుకు సంబంధించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యవకులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు.
అయితే గంజాయి మత్తులో ఉన్న యువకులు పోలీసు వాహనం ఎక్కి నానా రచ్చ చేశారు. పోలీసు వాహనంతో పాటు అక్కడ ఉన్న పలు వాహనాల అద్దాలను పగలగొట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొనేందుక కఠినంగా వ్యవహరించారు. యువకులపై లాఠీలతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదిలావుంటే హైదరాబాద్ శివారులో జరిగిన రోడ్డుప్రమాదం ఓ గంజాయి ముఠా అతితెలివితో చేస్తున్న స్మగ్లింగ్ ను పట్టించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకులు శివం దూబే (25), దుర్గేష్ దూబే (37), సోనీ పాండే (28) గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా సరిహద్దుల్లో గంజాయిని సాగుచేసే వారినుండి కొనుగోలు చేసి పలు రాష్ట్రాలు దాటుకుని గుట్టుగా యూపీ వరకు చేర్చి అమ్ముతుంటారు. పోలీసులకు అనుమానం రాకుండా స్మగ్లింగ్ కోసం వాడే వాహనాలకు అధికారులు వాడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టిక్కర్ వాడుతున్నారు. దీంతో వీరి వాహనాన్ని ఏ రాష్ట్ర పోలీసులు ఆపకపోవడంతో యధేచ్చగా గంజాయిని తరలిస్తున్నారు.
ఇటీవల ఏపీ, ఒడిషా ఏజన్సీ ప్రాంతాల్లో దాదాపు 300 కిలోల గంజాయిని కొనుగోలు చేసింది ఈ యూపీ ముఠా. దీన్ని పదికిలోల చొప్పున 30 ప్యాకెట్లుగా మార్చి ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల మీదుగా యూపీకి తరలించేందుకు కారులో బయలుదేరారు. అయితే గంజాయిని తరలిస్తున్న కారు హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఓఆర్‌ఆర్‌పై గత సోమవారం ప్రమాదానికి గురయ్యింది. దీంతో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది.
