ఫోకస్ హుజురాబాద్... ఆఘమేఘాల మీద ప్రజలకు సంక్షేమ పథకాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాకే కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా మేనమామలా ఆడబిడ్డలను ఆదరించారని గంగుల కొనియాడారు.
కరీంనగర్: స్వాతంత్యం వచ్చిన దగ్గరినుండి దేశంలో ఎందరో ప్రధానులు, రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు మారారు కానీ ఎవ్వరూ మనింటి ఆడబిడ్డ కన్నీళ్లు తుడవలేదని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాకే కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా మేనమామలా ఆడబిడ్డలను ఆదరించారని గంగుల కొనియాడారు.
హుజురాబాద్ లో జరిగిన కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమంలో 260మంది లబ్దిదారులకు మంత్రి గంగుల చెక్కులను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఆడబిడ్డల పెళ్లికి ఆస్తుల్ని తాకట్టుపెట్టి అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. కానీ ఆ ఆడబిడ్డల కన్నీళ్లు తుడువడం కోసం... పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలు మార్చడం కోసం తెలంగాణ రావాలని కేసీఆర్ కోరుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మన బతుకులు మారుతాయని భావించి 'తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో' అనే నినాదంతో స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ ది అని గంగుల పేర్కొన్నారు.
ఇలా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధ్బుతమైన పరిపాలన కొనసాగుతుందని... బడుగు, బలహీనవర్గాలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని ముఖ్యమంత్రి ప్రసాదించారన్నారు. ముఖ్యమంత్రి బడుగు వర్గానికి చెందిన తనకు బిసి మంత్రిత్వ శాఖను కేటాయించారంటూ మరోసారి గంగుల ధన్యవాదాలు తెలిపారు.
read more తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరిన ఈటల, ఏనుగు, తుల ఉమ
''కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి అద్బుత పథకాలతో బిసిలకు అండగా నిలబడినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు. బిడ్డ పెళ్లి ఘనంగా చేయాలని ప్రతీ తల్లిదండ్రి కోరుకుంటారు... వారికి అండగా నిలబడి మేనమామలా కేసీఆర్ తోడ్పాటునందించారు. తద్వారా ఇళ్లు నవ్వుతున్నాయి... ఇల్లు నవ్వితే పల్లె, పల్లెనవ్వితే తెలంగాణ, తెలంగాణ నవ్వుతూ ఉంటే కేసీఆర్ సంతోషపడతారు'' అని గంగుల పేర్కొన్నారు.
''అనేక దేశాలు, మనదేశంలోని అనేక రాష్ట్రాలు ఏవీ కూడా అందించని కళ్యాణలక్ష్మీ లాంటి పథకాల్ని తెలంగాణ అందిస్తుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో ఘననీయ ప్రగతిని రాష్ట్రం సాదింస్తుంది. ఇంతటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని లబ్దీపొందుతున్న మనందరం ఆశీర్వదించాలి'' అని మంత్రి గంగుల కోరారు.